టీసీఎస్‌ లాభం రూ.7,504 కోట్లు

కొత్త ఆర్డర్లు 610 కోట్ల డాలర్ల మేర ఉన్నాయి. మరిన్ని కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉండటం, మార్కెట్‌ వాటా పెరగడం లాంటివి భవిష్యత్‌ ఆశావహంగా ఉంటుందనే నమ్మకాన్ని పెంచుతున్నాయి.

– రాజేశ్‌ గోపీనాధన్‌, టీసీఎస్‌ సీఈఓ, ఎండీ

ఈ ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఏకీకృత ప్రాతిపదికన రూ.7504 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే కాలంలో నమోదైన లాభం రూ.8,042 కోట్లతో పోలిస్తే ప్రస్తుతం 6.87 శాతం తగ్గింది. ఎపిక్‌ సిస్టమ్స్‌ కార్పొరేషన్‌ కేసు పరిహారం కోసం కేటాయించిన రూ.1,218 కోట్లు కూడా కలిపితే లాభం 4.9 శాతం అధికంగా రూ.8433 కోట్లు అయ్యేదని సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.38,977 కోట్ల నుంచి 3 శాతం పెరిగి రూ.40,135 కోట్లకు చేరింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ 26.2 శాతంగా నమోదైందని, ఇది 8 త్రైమాసికాల గరిష్ఠమని సంస్థ తెలిపింది.
మరికొన్ని వివరాలు ఇలా..
* ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే ఆదాయం స్థిర కరెన్సీ రూపేణా 4.8 శాతం, డాలరు రూపేణ 7.2 శాతం వృద్ధి చెందాయి.
* విభాగాల వారీగా బీఎఫ్‌ఎస్‌ఐ 6.2 శాతం, రిటైల్‌ 8.8%; లైఫ్‌ సైన్సెస్‌, ఆరోగ్య సంరక్షణ 6.9%; సాంకేతికత సేవలు 3.1%, తయారీలో 1.4% చొప్పున ఆదాయం పెరిగింది. కమ్యూనికేషన్స్‌, మీడియ విభాగ ఆదాయం 2.4 శాతం మేర తగ్గింది.
* ఆదాయం ఉత్తర అమెరికాలో 3.6%, బ్రిటన్‌లో 3.8%, ఐరోపాలో 6.1%, భారత్‌లో 20%, లాటిన్‌ అమెరికాలో 5.5%, ఆసియా పసిఫిక్‌లో 2.9%, మధ్య ప్రాశ్చ్య దేశాల్లో 7% చొప్పున పెరిగింది.
* ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండు చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. నవంబరు 3వ తేదీన డివిడెండు చెల్లింపు ఉంటుందని, అక్టోబరు 15ను రికార్డు తేదీగా ఖరారు చేశామని టీసీఎస్‌ వెల్లడించింది.
* 2020 సెప్టెంబరు 30 నాటికి కొత్తగా చేరిన 16,000 మందితో కలిసి టీసీఎస్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,53,450. అక్టోబరు 1 నుంచి పనితీరు ఆధారంగా, వేతనాల పెంపును వర్తింపజేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
* ఉద్యోగుల వలసల రేటు జీవనకాల కనిష్ఠమైన 8.9 శాతానికి పరిమితమైంది.
సీఎఫ్‌ఓగా సమీర్‌ సెక్సారియా
ప్రస్తుత ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ) వి.రామకృష్ణన్‌ 2021 ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సమీర్‌ సెక్సారియా తదుపరి ఈ బాధ్యతలు చేపడతారని పేర్కొంది.

రూ.16,000 కోట్ల మెగా బైబ్యాక్‌

రూ.3,000 చొప్పున 5.3 లక్షల షేర్లు తిరిగి కొనుగోలు

టీసీఎస్‌ మెగా బైబ్యాక్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.3,000 చొప్పున 5,33,33,333 షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.16,000 కోట్లు వెచ్చించనుంది. ఈ బైబ్యాక్‌ ప్రతిపాదనకు బుధవారం టీసీఎస్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. నిన్నటి షేరు ముగింపు ధరైన రూ.2,737.40తో పోలిస్తే బైబ్యాక్‌లో 9 శాతం ఎక్కువగానే వాటాదార్లకు కంపెనీ ఆఫర్‌ చేస్తుండటం గమనార్హం. బైబ్యాక్‌కు సంబంధించిన తేదీలు, ఇతరత్రా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. .
13న బైబ్యాక్‌పై విప్రో బోర్డు నిర్ణయం: విప్రో కూడా బైబ్యాక్‌ ప్రక్రియను ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. 13న జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనను బోర్డు డైరెక్టర్లు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని ఎక్స్ఛేంజీలకు విప్రో తెలియజేసింది. అయితే బైబ్యాక్‌కు సంబంధించి ఇతరత్రా వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *