సీఎం జగన్ పై చర్యలకు సుప్రీంకోర్టులో పిటిషన్

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై సంచలన ఆరోపణలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తొలిసారి ప్రతికూలత ఎదురైంది. ఈ నెల 6న ఢిల్లీలో సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డేను కలిసిన జగన్.. ఏపీ హైకోర్టు జడ్జిలు, సుప్రీం జడ్జి ఎన్వీ రమణపై ఫిర్యాదు లేఖను అందించారని సీఎం సలహాదారు అజయ్ కల్లాం శనివారం(ఈనెల 10న) మీడియాకు వెల్లడించడంతో ఈ వ్యవహారం బహిర్గతమైన సంగతి తెలిసిందే. సదరు లేఖపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో ఏపీ సీఎంపై చర్యలు కోరుతూ సుప్రీంకోర్టులోనే సోమవారం పిటిషన్ దాఖలైంది.

హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలను ఉద్దేశించి ఫిర్యాదు చేయడం, సీజేఐకి ఇచ్చిన లేఖ వివరాలను మీడియాకు బహిర్గతం చేయడంలో ఏపీ సీఎం జగన్ తీరు అసాధారణంగా ఉందని, ఇది ప్రజాస్వామిక న్యాయవ్యవస్థను అగౌరవపర్చినట్లవుతుందని, ఇందుకుగానూ ఆయన(సీఎం)పై చర్యలు తీసుకునే దిశగా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, అదే సమయంలో ఈ వ్యవహారంలో మరోసారి ప్రెస్ మీట్లు లేదా బహిరంగ ప్రకటనలు చేయకుండా కట్టడి చేయాలని పిటిషన్ లో కోరారు. ప్రముఖ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు..

”హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చించడానికి వీల్లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 121, ఆర్టికల్ 211లో ఉంది. ఏపీ సీఎం స్వయంగా లేఖ రాయడం ద్వారా, తన ప్రతినిధులతో మీడియాతో మాట్లాడించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఆయన(జగన్)కు న్యాయవ్యవస్థను విధిగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. కానీ తన తీరుతో ఆయన ప్రజాస్వామిక వ్యవస్థలను అస్థిరపరిచే ప్రయత్నం చేశారు. దీనిపై చర్యలకు ఆదేశించండి” అని లాయర్ సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ లో పేర్కొన్నారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై అసాధారణ ఆరోపణలు చేసిన ఏపీ సీఎం.. వాటిని మీడియా ద్వారా ప్రజలకు బహిర్గతం చేయడం ద్వారా న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసే ప్రయత్నం చేశారంటూ అడ్వొకేట్ సునీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించేది, లేనిది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఎం లేఖ ఇప్పటికీ సీజేఐ జస్టిస్ బోబ్డే పరిధిలో ఉండటం, దానిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో తాజా పిటిషన్ పై కోర్టు ఎలా వ్యవహరిస్తుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పట్ల కొందరు న్యాయమూర్తుల వ్యవహరా శైలిపై ఇప్పటికే సీజేఐకు లేఖ రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇదే అంశంపై అతి త్వరలోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను కలవబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్.. రాష్ట్రపతి, ప్రధానుల అపాయింట్మెంట్ కోరారని, అది ఖరారైన వెంటనే ఢిల్లీకి పయనమవుతారని విశ్వసనీయంగా తెలిసింది. సీనియారిటీ ప్రకారం జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో టాప్-2 జడ్జిగా ఉండటం, తదుపరి సీజేఐగానూ ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉండటం తెలిసిందే.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *