మూసీ నది ఉగ్రరూపం దాల్చింది…సింగూరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

మూడు దశాబ్దాల తర్వాత రెట్టింపు స్థాయిలో వరద పోటేత్తింది. వాగులు, వంకలతో పాటు నగరంలోని కాలనీలు, వీధుల నుంచి వచ్చే వరదలన్నీ మూసీలో కలవడంతో ఉధృతంగా ప్రవహించింది. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. మూసీనదిపై పలు ప్రాంతాల్లో బ్రిడ్జిలపై నుంచి నీళ్లు ఉధృతంగా ప్రవహి ంచాయి. పరీవాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీనది నగరానికి ప్రవేశించే లంగర్‌హౌజ్‌ టిప్పుఖాన్‌ బ్రిడ్జి వద్ద ఎలాంటి అలజడి లేకుండా ప్రవహిస్తోంది. అంబర్‌పేట, గోల్నాక డివిజన్లలో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్‌ నుంచి అలీకేఫ్‌ వైపు ఉన్న బ్రిడ్జిపై నుంచి సుమారు నాలుగు అడుగుల ఎత్తులో మూసీనది నీరు వెళుతోంది. చాదర్‌ఘాట్‌ మహాంకాళి ఆలయం పక్కన బ్రిడ్జి నుంచి అంబర్‌పేట లోని అహ్మద్‌ నగర్‌ వరకు పలు ప్రాంతాలు నీట మునిగాయి.

ఆయా ప్రాంతాల నుంచి సుమారు 500 కుటుంబాలు ఇతర ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాల్స్‌, ఫంక్షన్‌హాల్స్‌లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంటున్నాయి. అఫ్జల్‌గంజ్‌, చాదర్‌ఘాట్‌ వద్ద పది అడుగుల ఎత్తు మేర నీటి ప్రవాహం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన వాహనాలన్నీ మూసీ పాలయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని వాటర్‌బోర్డు ఎండీ దానకిషోర్‌ హెచ్చరించారు. బుధవారం ఉదయం హిమాయత్‌ సాగర్‌ను సందర్శించి వరద పరిస్థితి గురించి అధికారులతో ఆయన సమీక్షించారు. హిమాయత్‌సాగర్‌కు 25 వేల క్యూసెక్కుల నీరు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 గేట్లు ఎత్తివేశామని తెలిపారు. వరదనీరు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా క్లోరిన్‌ మాత్రలు సరఫరా చేస్తున్నామని వివరించారు. పరీవాహక ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, వాటర్‌బోర్డు అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. 13 గేట్లు ఎత్తడంతో వాగు ఉధృతంగా వచ్చి బాపూఘాట్‌ సమీపంలోని సంగమం వద్ద మూసీతో జత కలిసింది. గండిపేట ‘ఉస్మాన్‌సాగర్‌’కు జలకళ సంతరించుకుంటోంది. పూర్తిస్థాయి మట్టం 1790 అడుగులు కాగా, బుధవారం సాయంత్రానికి 1780.40 అడుగులకు నీటిమట్టం చేరింది.

మూడేళ్ల తర్వాత సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మంగళవారం ఉదయం 3,284 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు ఎగువన మంజీరా నది పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో మూడు (11, 13, 14 నంబర్‌) క్రస్ట్‌ గేట్లను 2.50 మీటర్లు ఎత్తిన అధికారులు.. వరద మరింతగా పెరగడంతో ఉదయం 7.30 గంటలకు మరో రెండు గేట్లను ఎత్తారు. సింగూరు ప్రాజెక్టు వరద తాకిడికి మంజీరా తీర ప్రాంతంలో సదాశివపేట మండలం ఏటిగడ్డసంగం శివారులోని వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న ఏడుగురు కూలీలు వరద నీటిలో చిక్కుకుపోయారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *