1,500 పైగా కాలనీలు జలదిగ్బంధం…. నీట మునిగిన ఇళ్లు.. బతుకమ్మలను తలపించాయి! గ్రౌండ్‌ రిపోర్టు

జడివాన.. అలజడి సృష్టించింది. జలఖడ్గానికి జనం కకావికలమయ్యారు. 1,500 పైగా కాలనీలు జలదిగ్బంధమయ్యాయి.. 20,540 ఇళ్లు నీట మునిగాయి.

పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి.. ఇదీ భాగ్యనగరం పరిస్థితి. వందేళ్ల తర్వాత కురిసిన రికార్డు వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వానలకు నాలాలు ఉప్పొంగాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులు తెగిపోయాయి. కుంటలు పొంగిపొర్లాయి. వాటిల్లో ఉండాల్సిన నీళ్లు రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి చేరాయి. విజయవాడ, కరీంనగర్, వరంగల్‌ మార్గాలు జలమయమయ్యాయి.  హైద‌రాబాద్ నగరంలో కుంభవృష్టి వర్షం పెను విధ్వంసమే సృష్టించింది. జనజీవనాన్ని అతులాకుతులం చేసింది. వరద పోటెత్తడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మంత్రి కేటీఆర్‌ బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు పర్యవేక్షించారు. కాగా, బల్దియా, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు బాధితులకు కొండంత అండగా నిలిచాయి. ముంపు ప్రాంతాల వారికి పునరావాసం కల్పించారు. నిరాశ్రయులకు ఆహార పొట్లాలను అందించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తామని బాధితులకు ధైర్యం చెప్పారు.

సరూర్‌నగర్‌ సర్కిల్‌లోని కోదండరామ్‌నగర్‌, శారదా థియేటర్‌ ప్రాంతాల్లో గోడలు కూలాయి. సంతోష్‌నగర్‌లో శంకర్‌నగర్‌, చంచల్‌గూడ, డబీర్‌పుర ప్రాంతాల్లో పురాతన నిర్మాణాలు, చార్మినార్‌లోని మదీనా బిల్డింగ్‌ వద్ద ఆశూర్‌ ఖానాలో గోడ కూలిపోయాయి. ఫలక్‌నుమాలోని ఫాతిమానగర్‌లో పాత ఇల్లు నేలమట్టమైంది. రాజేంద్రనగర్‌లోని అలీనగర్‌లో పురాతన ఇల్లు కూలి ఒకరు చనిపోయారు. మాదాపూర్‌లోని జైన్‌ శ్రీకర్‌ రెసిడెన్సీకి చెందిన ప్రహరీ, మధురానగర్‌లో ఐదు చెట్లు నేలకూలాయి. బల్దియా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కూకట్‌పల్లిలోని భరత్‌నగర్‌ ఎల్‌ఐజీ కాలనీలో రెండు చెట్లు నేలకూలాయి. మూసాపేట్‌లోని భరత్‌నగర్‌, చింతల్‌లో గోడలు కూలాయి. అల్వాల్‌, వెంకటాపురం, మారియట్‌ హోటల్‌ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. మల్కాజిగిరి ఎస్‌పీ నగర్‌లో ప్రహరీ, లాలాపేట్‌ ఫ్లై ఓవర్‌ వద్ద చెట్టు నేలకూలింది.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు బల్దియా కాల్‌సెంటర్‌, డయల్‌-100, మై జీహెచ్‌ఎంసీ యాప్‌, వెబ్‌సైట్‌ తదితర మాధ్యమాల ద్వారా 844 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా 600 ఫిర్యాదులు నీట మునిగినవి, మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లిన ఘటనలకు సంబంధించినవి ఉన్నాయి. కాగా, చెట్లు కూలిన ఘటనలు 145 ప్రాంతాల నుంచి నమోదయ్యాయి. 59 చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అంబర్‌పేట్‌-మూసారాంబాగ్‌ మధ్య మూసీపై ఉన్న వంతెన రెండువైపులా గ్రిల్స్‌ కొట్టుకుపోయాయి. హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో దిగువ ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. పాతబస్తీ, మల్కాజిగిరి ప్రాంతాల్లోని పలుచోట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి బాధితులను తరలించేందుకు బోట్లను ఏర్పాటు చేశాయి. కాగా, మంత్రి కేటీఆర్‌ బుధవారం ఉదయం బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు పర్యవేక్షించారు.

కాప్రా సర్కిల్‌ పరిధిలోని దాబా గార్డెన్‌, ఎర్రకుంట, అంబర్‌నగర్‌, ఇందిరానగర్‌ కాలనీలు నీట మునిగాయి. సుమారు 100 మందిని సమీపంలోని ఎర్రకుంట కమ్యూనిటీహాల్‌, సీడీఎస్‌ బిల్డింగ్‌, కమలా మెమోరియల్‌ స్కూల్‌ తదితర చోట్లకు తరలించి వారికి ఆహార పొట్లాలు అందించారు.

ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని పెద్ద చెరువు, చిన్న చెరువులు పొంగిపొర్లి సమీపంలోని ప్రాంతాలను ముంచెత్తాయి. సుమారు 100 మందిని హబ్సిగూడలోని జేఎన్‌ఎన్‌ కమ్యూనిటీహాల్‌, గాంధీనగర్‌ కమ్యూనిటీహాల్‌, చిలుకానగర్‌ ఆదర్శ్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌కు తరలించారు. అంతేకాకుండా సాయిచిత్ర కాలనీలోని 50, ఇందిరానగర్‌లోని 100, నేతాజీనగర్‌లోని 50 మందికి కలిపి మొత్తం మరో 100 మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

హయాత్‌నగర్‌లో బత్తుల చెరువు పొంగి పీవీఆర్‌ కాలనీ పూర్తిగా నీట మునిగింది. దీంతో సుమారు 325 మందిని సమీపంలోని మన్సూరాబాద్‌ వీకర్‌ సెక్షన్‌ కమ్యూనిటీహాల్‌, సాహెబ్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌కు తరలించి వారికి ఆహార పొట్లాలు అందించారు.

ఎల్బీనగర్‌లోని మల్లికార్జుననగర్‌, గుంటి జంగయ్య నగర్‌, రెడ్డి కాలనీ, సాగర్‌ ఎన్‌క్లేవ్‌, దాతు నగర్‌, వెంకటేశ్వర కాలనీ, సాయి గణేశ్‌నగర్‌, శ్రీదత్త నగర్‌, రెడ్డి బస్తీ, ఉదయ్‌నగర్‌, బైరామల్‌గూడ ఎస్సీబస్తీ, మల్‌రెడ్డి రంగారెడ్డి నగర్‌, దుర్గానగర్‌, ధర్మపురి కాలనీ, భాగ్యనగర్‌ కాలనీ, తపోవన్‌కాలనీ, గ్రీన్‌పార్క్‌ కాలనీ, అల్తాఫ్‌నగర్‌, సాయినగర్‌, కాకతీయనగర్‌, సౌభాగ్యనగర్‌ తదితర కాలనీలు నీట మునిగాయి. దీంతో సుమారు 500 మందిని వారి ఇండ్లలోనే పై అంతస్తుల్లో ఉంచి వారికి ఆహార పొట్లాలను అందించారు. అలాగే మురికి వాడల్లో ఉంటున్న 40 మందిని పీజేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌కి తరలించారు.


సరూర్‌నగర్‌ సర్కిల్‌లోని సీతల్‌బస్తీ, కోదండరామ్‌నగర్‌, భవానీనగర్‌, నాగోలు, యాదవనగర్‌, డాక్టర్స్‌ కాలనీ, అల్కాపురి, మారుతీనగర్‌, కమలానగర్‌, నేషనల్‌ హైవే రోడ్‌, మెట్రో పిల్లర్‌ నం. 1549, చైతన్యపురి తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో అక్కడ ఉంటున్న సుమారు 1250 మందిని సాయి గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌, కృష్ణానగర్‌లోని ఐసొలేషన్‌ సెంటర్‌కు తరలించి ఆహార పొట్లాలు అందించారు. కొందరిని సమీపంలోని అపార్ట్‌మెంట్లలోని పై అంతస్తులకు తరలించారు.

చాంద్రాయణగుట్ట సర్కిల్‌ పరిధిలో గాజీ మిల్లత్‌ కాలనీ, అల్జుబే కాలనీ, అల్నూర్‌ కాలనీ, నిర్మా కాలనీ, కృష్ణారెడ్డినగర్‌, సాదత్‌నగర్‌, పార్వతీనగర్‌, అల్‌జజీరా కాలనీ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులను ఫతేనగర్‌ మసీద్‌, రాజీవ్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల, అక్బరుద్దీన్‌ ఒవైసీ కమ్యూనిటీ హాల్‌, సాయిబాబానగర్‌ కమ్యూనిటీహాల్‌, జంగమ్మెట్‌ వార్డు ఆఫీసు తదితర చోట్ల పునరావాసం కల్పించారు. ఈ ప్రాంతాల్లో సుమారు 5వేల మందికి ఆహార పొట్లాలు అందించారు.
చార్మినార్‌ సర్కిల్‌లో ముర్గీచౌక్‌, మీరాలంమండీ, అమన్‌నగర్‌ ప్రాంతాలు జలమయమయ్యాయి. బల్దియా సిబ్బంది నిలిచిన నీటిని తొలగించారు.

ఫలక్‌నుమా సర్కిల్‌ పరిధిలోని అల్‌జుబేల్‌ కాలనీ నీట మునగడంతో సుమారు 520 మందిని మీరజ్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌కు తరలించి ఆహార పొట్లాలను అందజేశారు.

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో పల్లెచెరువు, అప్పా చెరువు పొంగిపొర్లి సన్‌సిటీ వద్ద గల రిచ్‌మాండ్‌ విల్లాస్‌, ఎయిర్‌పోర్టు రోడ్‌, అలీనగర్‌, సుభాన్‌కాలనీ, మిలన్‌ కా ఆలనీ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. 300 మందిని సమీపంలోని సిద్ధా ఫంక్షన్‌హాల్‌, ఒఎస్‌డీ ఫంక్షన్‌ హాల్‌కు తరలించి ఆహార పొట్లాలను అందజేశారు.
మెహిదీపట్నం సర్కిల్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 500 మందిని రైల్వే స్టేషన్‌కు తరలించి వారికి ఆహార పొట్లాలు అందించారు.

కార్వాన్‌ సర్కిల్‌లో నదీంకాలనీ, విరాసత్‌నగర్‌, అహ్మద్‌కాలనీ, షాహతీమ్‌ పహాడ్‌, కేశవ్‌స్వామి నగర్‌, దుర్గానగర్‌ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. 1600 మందిని మసీద్‌ ఏ గౌర్‌, మసీద్‌ ఏ కరీమా, ఒవైసీ కమ్యూనిటీ హాల్‌, ఎండీ లైన్స్‌, కేశవ్‌ స్వామి నగర్‌, జియాగూడ తదితర ఫంక్షన్‌హాళ్లకు తరలించారు.


గోషామహల్‌ సర్కిల్‌లో గోషాఘాట్‌, గురుద్వారా వెనుక ప్రాంతం నీట మునిగాయి. డీఆర్‌ఎఫ్‌ బృందాలు నీటిని తొలగించడంతో సమస్య తీరిపోయింది.

ఖైరతాబాద్‌లో ఎంఎస్‌ మక్తా, బీఎస్‌ మక్తా ప్రాంతాలు నీట మునగడంతో సుమారు 2000 మందిని ఎంఎస్‌ మక్తా కమ్యునిటీ హాల్‌కు కొందరిని, మరికొందరిని సమీపంలోని అపార్ట్‌మెంట్లలోని పై అంతస్తులకు తరలించారు.
యూసుఫ్‌గూడ సర్కిల్‌లో కొన్నిచోట్ల ఇండ్లు నీట మునిగినప్పటికీ తరలించే అవసరం ఏర్పడలేదని అధికారులు తెలిపారు. అయితే 500 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

శేరిలింగంపల్లిలో సుదర్శన్‌ నగర్‌ కాలనీ, రైల్వే విహార్‌ ఫేస్‌-1, లింగంపల్లి తారానగర్‌, గుల్మోర్‌కాలనీ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

చందానగర్‌లో దీప్తిశ్రీనగర్‌, హుడా కాలనీ, మియాపూర్‌ ప్రాంతాల్లో ఇండ్లలో నీరు చేరింది. దీంతో బల్దియాకు చెందిన మాన్‌సూన్‌ రెస్పాన్స్‌ బృందాలు వెంటనే నీటిని తొలగించేందుకు తగిన ఏర్పాట్లు చేశాయి.


పటాన్‌చెరూ, ఆర్సీపురం సర్కిల్‌ పరిధిలో ముంబై జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగింది. అలాగే, ఆర్సీపురంలోని నాగులమ్మ టెంపుల్‌ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఇంజినీరింగ్‌ సిబ్బంది మోటర్ల ద్వారా నీటిని తొలగించారు.

ఫతేనగర్‌, శాస్త్రీనగర్‌, భరత్‌నగర్‌, లాలాపూర్‌, అల్లాపూర్‌ వం ప్రాంతాలు నీట మునిగాయి. 25 మందిని అల్లాపూర్‌ కమ్యూనిటీహాల్‌కు తరలించారు. 9000 మందికి ఆహార పొట్లాలను అందించారు.


కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో బాలానగర్‌, సాయినగర్‌, సీబీఆర్‌ నగర్‌, కల్యాణ్‌నగర్‌, ఏవీపురం, అంబేద్కర్‌నగర్‌ బస్తీ తదితర ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. సుమారు 5000 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లో సుభాష్‌నగర్‌, పేట్‌ బషీర్‌బాగ్‌, అడిక్‌మెట్‌ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో 50 మందిని గాంధీనగర్‌ కమ్యూనిటీహాల్‌కు తరలించారు.

గాజులరామారం సర్కిల్‌లోని దేవేందర్‌నగర్‌, సోనియా గాంధీనగర్‌లు నీట మునిగాయి. దీంతో 100 మందని శ్రీరామ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌కు తరలించి ఆహార పొట్లాలు అందించారు.


అల్వాల్‌ సర్కిల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో 400 మందిని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాల్‌కు తరలించారు.

ముషీరాబాద్‌ సర్కిల్‌లో అశోక్‌నగర్‌, ఇందిరాపార్క్‌, దోమలగూడ ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులకు బోటును ఏర్పాటు చేసి 500 మందిని మహబూబ్‌ ఫంక్షన్‌హాల్‌కు తరలించారు. అలాగే, మరో 1800 మందికి ఆహార పొట్లాలను అందించారు.

అంబర్‌పేట్‌ సర్కిల్‌లో రత్నానగర్‌, మల్లికార్జుననగర్‌, సంజీవ్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన 500 మందిని రత్నానగర్‌, సంజీవ్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాళ్లకు తరలించారు.


మల్కాజిగిరిలో షిర్డీనగర్‌, ఎస్‌పీనగర్‌, ఎన్‌ఎండీసీ, తులసీనగర్‌ ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టి ఎనిమిది మందిని రక్షించాయి. స్థానికులను సమీపంలోని బల్దియా కమ్యూనిటీహాల్‌కు తరలించారు.

సికింద్రాబాద్‌ పరిధి చంద్రానగర్‌, ఇందిరానగర్‌లో కార్మీక ఫంక్షన్‌హాల్‌, లాలాపేట్‌ ప్లేగ్రౌండ్‌లో 200 కుటుంబాలకు ఆశ్రయం కల్పించారు.

బేగంపేట్‌ ప్రకాశ్‌నగర్‌లో 300 మందిని పైగా ప్యాలెస్‌కు తరలించారు. సుమారు 5000 మందికి ఆహార పొట్లాలను అందజేశారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *