త్వరగా గుర్తించగలగడమే రొమ్ము క్యాన్సర్ నిరోధించడంలో కీలకం….

మామోగ్రామ్ – జీవితాలను కాపాడుతుంది

త్వరగా గుర్తించగలగడమే రొమ్ము క్యాన్సర్ నిరోధించడంలో కీలకం

అక్టోబర్ నెలను ప్రతి ఏటా రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా అక్టోబర్ నెలలో మూడవ శుక్రవారం రోజున జాతీయ మామోగ్రఫీ దినంగా నిర్వహిస్తారు.  ఈ సంవత్సరం అక్టోబర్ 16 న నిర్వహించబోయే ఈ రోజున రొమ్ము క్యాన్సర్ కు సరైన పరిష్కారం దాన్ని త్వరగా గుర్తించడమని మహిళలకు గుర్తు చేయడమే లక్ష్యం.  మహిళలలో శారీరకమైన మార్పుల కారణంగా రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికన్నా ముందుగానే గుర్తించగలిగే ఏకైక ఆధునిక సాంకేతిక విజ్ఞానఫలమైనదే మామ్మోగ్రఫీ.

రొమ్ము క్యాన్సర్ పై అవగాహన

ఏటా అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిపించే పలు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అది రాకుండా అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటూ ఒక వేళ వచ్చినా దాన్ని ముందుగా గుర్తించి మరణాలు తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది.

ఇక రొమ్ము క్యాన్సర్ రావడానికి గల కారణాలను పరిశీలిస్తే…ఇంట్లో తల్లి లేక సొదరి లేక అమ్మమ్మ లకు రొమ్ము క్యాన్సర్ ఉన్నా, పొగ త్రాగడం, ఆల్కహాల్ సేవించడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, సరైన వ్యాయామం లేక పోవడం, మొదటి గర్భదారణ ఆలస్యం కావడం, తక్కువ గర్భాలు, గర్భ నిరోథక మాత్రలు తీసుకోవడం, రొమ్ము ద్వారా పాలు పట్టకపోవడం మరియు ఒత్తిడి వంటి ప్రధానమైవిగా చెప్పుకోవచ్చు.  అయితే ఈ అంశాలన్నింటిపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం తో పాటూ జీవన శైలిలో మార్పులు, సరైన పౌష్టికాహారం మరియు నిరంతరం వ్యాయామం చేయడం ద్వారా రొమ్ము క్యాన్సర్ రాకుండా అరికట్టుకోవచ్చు.

మామోగ్రఫీ

మామోగ్రఫీ అనేది తక్కువ సామర్థ్యం కలిగిన ఎక్స్ రే ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం.  దీనిని రొమ్ము క్యాన్సర్ ఏర్పడిన తర్వాత ఉండే మొదటి దశ లక్షణాలైన రొమ్ములో ఏర్పడే చిన్న చిన్న గడ్డలను కనుగోడానికి ఉపయోగిస్తారు.  దీనిని 1950 లో రాబర్ట్ ఎగాన్ అనబడే శాస్త్రవేత్త మొదటి సారిగా రొమ్ము ను పరిశీలించడానికి వినియోగించారు.  ధ ఇగాన్ టెక్నిక్ గా పిలువబడే ఈ సాంకేతిక పరిజ్ఞానం తో మహిళ రొమ్ములో గడ్డలున్నాయి లేదా రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు రావడానికన్నా ముందుగానే రొమ్ము కణజాలంలో ఏర్పడే గట్టి కణితులను కనుగొని పరిశీలించడానికి ఉపయోగించారు.

మామోగ్రఫీ ఎలా నిర్వహిస్తారు?

మహిళల రొమ్ముపై మామోగ్రఫీ పరీక్ష నిర్వహించినపుడు మామోగ్రఫీ యంత్రం అందులో ఉంచబడిన రొమ్మును కొంత మేర ఒత్తిడి కలిగించి నొక్కడం ద్వారా దానిని పరిశీలించడం జరుగుతుంది.  ఇలా ఒత్తిడితో నొక్కడం ద్వారా రొమ్ము కణజాలం యొక్క మందం విస్తరించుకొని తద్వారా అది తీసుకొనే రేడియేషన్ పదార్థ మొత్తం తగ్గడమే కాకుండా రొమ్ము కణాలు కదలడం వలన మామోగ్రామ్ చిత్రంలో ఏర్పడే అస్పష్టత తగ్గుతుంది.  మామోగ్రఫీ పరీక్ష నిర్వహించుకొనే సందర్భంలో మహిళలు రొమ్ముపై డియోడ్రెంట్, లోషన్, పెర్ఫూమ్ లేదా టాల్కమ్ పౌడర్ వంటి వాటిని వేసుకోవద్దని చెబుతారు.  ఎందుకంటే మామోగ్రామ్ లో అవి కూడా గడ్డలు లేదా కణితులుగా కనపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి.

మామోగ్రఫీ పరీక్ష నిర్వహించే సందర్భంలో నొప్పి ఉంటుందా?

గతంలో వినియోగంలో ఉండిన సాంప్రదాయ మామోగ్రఫీ యూనిట్ లో మామోగ్రామ్ పరీక్ష నిర్వహించేటపుడు రొమ్ముపై ఒత్తిడి కలిగించడం ద్వారా నొక్కడం కారణంగా కొంత మేర నొప్పి మరియు ఇబ్బంది కలిగేది.  అయితే ఇపుడు అందుబాటులోనికి వచ్చిన ఆదునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 3 డి డిజిటల్ మామోగ్రఫీ లేదా టోమోసింథసిస్ యూనిట్ ల కారణంగా నొప్పి తగ్గడమే కాకుండా సులభంగా నిర్వహించగలిగి మరింత ఖచ్చితమైన ఫలితాలు పొందగలుగుతారు.

మామోగ్రామ్ అవసరం ఏమిటి?

భారతీయ మహిళలలో వచ్చే క్యాన్సర్ లలో 14 శాతం క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్లు అని చెప్పవచ్చు.  అటు పట్టణ ప్రాంతాలలో ఇటు గ్రామాలలో కూడా నానాటికీ రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది. 2018 లో వచ్చిన నివేదిక ప్రకారం 1,62,468 కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు మన దేశంలో గుర్తించబడగా అందులో 87,090 కేసులలో మరణం సంభవించింది.  అయితే ఇలా నమోదు కాబడుతున్న క్యాన్సర్ వ్యాధులను ఆలస్యంగా గుర్తించడం వలన వ్యాధిని పూర్తిగా నయం చేయలేకపోవడం జరుగుతోంది.  అంటే 50 శాతం మందికి పైగా మహిళలలో క్యాన్సర్ వ్యాధి సోకిన తర్వాత దానిని స్టేజి 3 లేదా 4 లో గుర్తించడం జరుగుతోంది.  తద్వారా వ్యాధి గుర్తించిన తర్వాత కనీసం ఐదు సంవత్సరముల పాటూ జీవించడం అనేది మన దేశంలో కేవలం 60 శాతం వ్యాధి గ్రస్థులలో మాత్రమే సాధ్యమవుతుండగా అదే అమెరికా లాంటి అభివృద్ది చెందుతున్న దేశంలో 80 శాతం మహిళలు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు.  ఇందుకు ప్రధానంగా మన దేశంలో వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడంతో పాటూ నియమిత కాలంలో మామోగ్రఫీ పరీక్ష నిర్వహించుకోలేక పోవడంతో పాటూ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడమే కారణమని చెప్పవచ్చు.

మామోగ్రఫీ వ్యాధి నిర్థారణలో ఎంత ఖచ్చితంగా పని చేస్తుంది?

అమెరికాలో ఉన్న జాతీయ క్యాన్సర్ ఇన్సిస్టిట్యూట్ లెక్కల ప్రకారం నియమిత కాలంలో మామోగ్రఫీ నిర్థారణ పరీక్ష చేయించుకోవడం ద్వారా కనీసం 40 శాతం మందిలో మరణాలను అరికట్టగలిగారని తేలింది.  దీన్ని బట్టి చూస్తే ఏటా మామోగ్రామ్ పరీక్ష నిర్వహించుకోవడం ద్వారా వైద్యులు లేదా రోగులు రొమ్ములో ఏర్పడే కణితులను గుర్తు పట్టడానికి కనీసం రెండు సంవత్సరముల ముందుగానే ఖచ్చిత్వంగా కనిపెట్టవచ్చని తెలుతోంది.

సాంప్రదాయ మామోగ్రఫీలో ఉన్న పరిమితులు

ఒక వేళ మహిళల రొమ్ము కణజాల మందం ఎక్కువగా ఉన్నపుడు రొమ్ము కణజాలం ఒకదానిపై ఒకటి ఎక్కువగా వ్యాప్తి చెందిన కారణంతో సాంప్రదాయ మామోగ్రఫీలో చిన్న చిన్న క్యాన్సర్ కణితులను గుర్తించడం కష్టసాధ్యమవుతుంది.  వీటి ద్వారా పరీక్ష నిర్వహించే సందర్భంలో రేడియోషన్ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ యూ యస్ ఫ్ డి ఏ వారి నిబందనలకు లోబడి అనుమతించబడిన స్థాయిలోనే ఉంటుంది అంటే వాతావరణంలో ఉండే ఆరు వారాల రేడియేషన్ ప్రభావానికి సమానంగా ఉంటుంది.  అయితే ఈ ప్రమాదం కన్నా మామోగ్రామ్ కారణంగా ఏర్పడే లాభాలు ఎక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం.

3 డి మామోగ్రఫీ లేదా టోమోసింథసిస్ యూనిట్ లో ఉండే లాభాలు

3 డి మామోగ్రఫీ లేదా టోమోసింధసిస్ అనేది రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికి అందుబాటులోనికి వచ్చిన ఆధునిక పరీక్షా సదుపాయం.  దీనిలో రొమ్ము ను 1 mm మందంలో విడగొట్టి చిత్రాలు తీయడం జరుగుతుంది.  దాంతో రొమ్ము మొత్తాన్ని చిన్న చిన్న పొరలుగా విడగొట్టి అత్యంత సూక్ష్మమైన అంశాలను కూడా పరిశీలించగలిగి అత్యంత మందం కలిగిన రొమ్ము కణజాలంలో దాగి ఉంటే అతి చిన్నవైన కణితులను కూడా స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.

మామోగ్రఫీ పరీక్ష నిర్వహించుకోవడానికి ముందు రోగిని తయారు చేయడం

రుతుక్రమం ద్వారా ఏర్పడే పీరియడ్స్ కు ఒక వారం ముందు వరకూ మామోగ్రఫీ చేయించుకోవడం చేయకూడదు.  ఎందుకంటే పీరియడ్స్ వచ్చే కాలంలో శరీరంలో ఉండే హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా రొమ్ము మరింత మందంగా లేదా ఉబ్బి ఉంటుంది.  అందుచేత రుతుక్రమ కాలెండర్ లో 7 నుండి 21 రోజుల మధ్య మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవచ్చు.

ఇక మామోగ్రఫీ పరీక్ష చేయించుకొనే రోజు రొమ్ముపై డియోడరెంట్, పెర్ఫూమ్ లేదా టాల్కం పౌడర్ లాంటివి అద్దడం చేయరాదు.  అవి రొమ్ముపై పొరలా ఏర్పడి మామోగ్రామ్ లో చిన్న చిన్న కణుతులుగా కనపడే ప్రమాదం ఉంటుంది.

మామోగ్రఫీ పరీక్షను ఏ వయస్సు నుండి మరియు ఎంత తరచుగా చేసుకోవాలి?

సాదారణ మహిళలలో 40 సంవత్సరములు దాటిన తర్వాత వైద్యుల సలహా మేరకు ప్రతి ఏటా లేదా రెండేళ్లకొక సారి మామోగ్రామ్ పరీక్ష నిర్వహించుకోవచ్చు.

ఇక కుటుంభంలో రొమ్ము క్యాన్సర్ లేదా BRCA1 or BRCA 2 జీన్ మ్యుటేషన్ కారీయర్స్ ఉన్న హైరిస్క్ కేటగరిలో ఉండే మహిళలు మాత్రం 30 సంవత్సరముల వయస్సు నుండి లేదా ఇంట్లో మరో కుటుంభ సభ్యునికి క్యాన్సర్ వ్యాధి వచ్చిన వయస్సు కన్నా పది సంవత్సరములు ముందు నుండే మోమోగ్రఫీ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది.  దీంతో పాటూ ప్రత్యామ్నాయంగా మామోగ్రఫీ తో పాటూ ఆరునెలల కొక సారి రొమ్ము MRI పరీక్ష చేయించుకోవచ్చు.

అందుకే మామోగ్రఫీ వ్యాధి నిర్థారణ పరీక్ష మహిళలలో రొమ్ము క్యాన్సర్ ను త్వరగా గుర్తించడానికి వీలు కలిపించడంతో పాటూ తద్వారా వారి జీవితాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నదనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

The article is prepared by Dr. Veeraiah Chowdary K, Chief Radiologist, Department, of Radiology, Basavatarakam Indo American Cancer Hospital & Research Institute, Hyderabad

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *