డాక్ట‌ర్ సుధాకర్ తరహాలో డాక్టర్ అనితారాణిపై వేధింపులు-డిప్యూటీ సీఎం అడ్డాలో…హైకోర్టులో కేసు

ఏపీలో విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ప్రవర్తించిన తీరును మర్చిపోకముందే దాదాపు ఇలాంటిదే మరో ఘటన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో చోటు చేసుకుంది. అవినీతిని ప్రశ్నించిన ఓ మహిళా డాక్టర్ పై జరిగిన వేధింపులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. వీటిపై టీడీపీ నేతలకు ఆమె ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడింది.

సుధాకర్ ప్లేస్ లో డాక్టర్ అనితారాణి… అమెరికాలో కోట్లు సంపాదించి పెట్టే ఉద్యోగాన్ని వదులుకుని గ్రామీణ ప్రాంత పేదలకు వైద్యం అందించాలన్న తపనతో ఏపీకి వచ్చిన అనితారాణి… చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులోని పెనుమూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గత డిసెంబర్లోనే డాక్టర్ గా చేరారు. రెండు నెలల క్రితం కింది స్ధాయి ఉద్యోగుల అవినీతిని ఆమె ప్రశ్నించారు. దీంతో స్ధానిక వైసీపీ నేతలు, పోలీసులు రంగంలోకి దిగి ఆమెను నానా ఇబ్బందులు పెట్టారు. డాక్టర్ సుధాకర్ లాగే ఆమెపై కూడా వేధింపులకు పాల్పడ్డారని ఆమె తాజాగా టీడీపీ నేతలకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు.

బాత్రూమ్ లో ఫొటోలు- చెప్పుకోలేని వేధింపులు?
రెండు నెలల క్రితం కింది స్ధాయి ఉద్యోగుల అవినీతిని ప్రశ్నించాక డాక్టర్ అనితారాణిపై వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇదే అంశంపై స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశాక అవి మరింత ఎక్కువయ్యాయి. మార్చి 22 జనతా కర్ఫ్యూ రోజున హాస్టల్ గదిలో బంధించి వైసీపీ నేతలను పిలిపించారు. వారు తీవ్రంగా దుర్భాషలాడుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. బాత్రూమ్ లోకి వెళ్లినా ఫొటోలు, వీడియోలు తీశారని టీడీపీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది.

కేసు పెట్టొద్దని బెదిరింపులు, ఒత్తిళ్లు!
జరిగిన విషయాన్ని స్ధానిక పోలీసులకు వీడియోతో సహా ఫిర్యాదు చేసినా స్టేషన్ కు పిలిపించి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కూర్బోబెట్టారే కానీ స్పందించలేదని అనితారాణి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కేసు పెట్టొద్దంటూ వైసీపీ నేతలు బెదిరించారని, ఉన్నతాధికారులతో ఫోన్లు చేయించి ఒత్తిడి చేశారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ లేదని, మహిళా కమిషన్ ఉన్నా న్యాయం జరిగే పరిస్దితి లేదని టీడీపీ నేత అనితకు చేసిన ఫిర్యాదులో అనితారాణి పేర్కొన్నారు.

న్యాయం కోసం హైకోర్టుకు…. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు, పోలీసుల తీరుతో తనకు న్యాయం జరిగే అవకాశం లేదని భావించిన డాక్టర్ అనితా రాణి వారం రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించినట్లు మీడియాకు తెలిపారు. డాక్టర్ సుధాకర్ తరహాలోనే ప్రభుత్వ, అధికార పార్టీ నేతల, పోలీసు వేధింపులు ఎదుర్కొన్న తనకు న్యాయం జరిపించాలని ఆమె హైకోర్టును కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ హైకోర్టు సీబీఐ విచారణ వేసే వరకూ వెళ్లిన ప్రభుత్వం అనితారాణి వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న చర్చ సాగుతోంది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: JournalistEye

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *