చెన్నైలో 500 కోట్ల రూపాయ‌లు ముంచాడు! హైద‌రాబాద్‌లో భార్య చేతిలో హతమయ్యాడు!

హైద‌రాబాద్ః తమిళనాడు ప్రజలను మనీ బ్యాక్‌ పాలసీ రాకెట్‌ స్కీంలో రూ.500 కోట్లు ముంచిన కేసులో నిందితుడు హైదరాబాద్‌లో భార్య చేతిలో హతమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం… ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడన్న కేసును మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయం బయటపడింది. చెన్నైకి చెందిన ప్రభాకరన్‌ అలియాస్‌ క్రిస్టి(50), సుకన్య(32) భార్యాభర్తలు. వారికి ముగ్గురు పిల్లలు. చెన్నైలో మనీ బ్యాక్‌ పాలసీ రాకెట్‌ కేసులో అతడు 2012లో అరెస్టయ్యాడు. 8 నెలల తర్వాత బెయిల్‌ పొంది తమిళనాడులో ఉండే పరిస్థితులు లేక మౌలాలి ఆండాల్‌ నగర్‌కు చేరుకున్నాడు. ఆ కేసులో 2013లో సుకన్యను కూడా అక్కడి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లలు చెన్నైలోని ప్రభాకరన్‌ తల్లిదండ్రులవద్ద ఉంటున్నారు. 2018లో ఆమె బెయిల్‌పై విడుదలైంది.

జైలు నుంచి వచ్చిన సుకన్యకు భర్త జాడ తెలియలేదు. పిల్లలను తీసుకుని చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని బంధువుల ఇంట ఉంటోంది. భర్త మౌలాలిలో ఉంటున్నట్టు తెలిసి పిల్లలను తీసుకుని 18న ఆండాల్‌నగర్‌కు చేరుకుంది. అకస్మాత్తుగా భార్య రావటంతో ప్రభాకరన్‌ కంగుతిన్నాడు. కలిసి జీవించేందుకు ఇష్టపడలేదు. తిరిగి చెన్నైకి వెళ్లిపొమ్మని డిమాండ్‌ చేశాడు. పక్షవాతంతో భర్త కదల్లేని పరిస్థితిని ఆసరాగా తీసుకుని 23న రాత్రి దిండుతో ముఖంపై అదిమి చంపేసింది. బయటవారికి భర్త నిద్రలో చనిపోయినట్టు చెప్పింది. స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తులో సుకన్య తానే హత్య చేసినట్టుగా అంగీకరించింది. ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌, ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *