కేసీఆర్ సర్కార్‌పై జేపీ నడ్డా సంచలన ఆరోపణలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ జిల్లా కార్యాలయాలకు భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్‌లో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రూ. 45వేల కోట్లకు పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారని ఆయన మండిపడ్డారు.

సంచలన ఆరోపణలు
‘గడిచిన ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు చేసిందేంటో కేసీఆర్ చెప్పాలి. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు?. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50వేల ఇళ్ళు కూడా కట్టలేదు. కరోనాను కట్టడి చేయకుండా సీఎం‌ కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదు. కరోనా టెస్టులు చేయటంలో తెలంగాణ వెనుకబడిపోయింది. లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి’ అని నడ్డా పిలుపునిచ్చారు.

మోదీ ఆలోచన మేరకు..
‘తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారు. కోవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో కేంద్రానికి దేశ ప్రజలు సహకరించాలి. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని కేంద్రం పనిచేస్తోంది. కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన. మోదీ ఆలోచన మేరకు పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపడుతున్నాం. కోవిడ్‌ను ఎదుర్కోవటంలో ప్రధాని మోదీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు’ అని నడ్డా వ్యాఖ్యానించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Syed sami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *