కన్నా లక్ష్మీనారాయణ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి ?

బీజేపీ మాజీ సారథి, సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి ? పెదకూరపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కన్నా లక్ష్మీనారాయణ తిరుగులేని నేతగా ఎదిగారు. అనేక మంది మహామహులను ఓడించి గెలుపు గుర్రం ఎక్కారు. చివరగా ఆయన గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఐదోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన ఎలా నెగ్గుకురాగలరు ? ఏ విధంగా ముందుకు సాగుతారు ? అనే అనేక విషయాలు రాజకీయంగా చర్చకు వచ్చాయి. గుంటూరు జిల్లాపై తనదైన ముద్ర వేసిన కన్నా కుటుంబం.. రాజకీయంగా అనేక పదవులు అందుకుంది. అదేసమయంలో అనేక పతనాలు కూడా చవి చూసింది.

వైఎస్ హయాంలో మంత్రి పదవిని చేపట్టారు. ఆయన కుమారుడు కన్నా నాగరాజు కూడా గుంటూరు నగర మేయర్‌గా చక్రం తిప్పారు. వైఎస్ మరణాంతరం కూడా ఆయన గుంటూరు జిల్లాలో రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లో తాను ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా వ్యవహరించారు. అయితే, రాష్ట్ర విభజన, వైఎస్ మరణంతో రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్‌ను విడిచి పెట్టాలని అనుకోకపోయినా.. పార్టీ పుంజుకునే ఛాన్స్ కనిపించని నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయారు. 2014 ఎన్నికల్లో కన్నా కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ఆయన జగన్ చెంతకు చేరాలని కూడా అనుకున్నారు. అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరేందుకు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. సడెన్‌గా ఒక్క రాత్రిలోనే సీన్ మారిపోయింది. బీజేపీలో చేరితే.. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇస్తామని హామీ దక్కిడంతో కన్నా లక్ష్మీనారాయణ కమలం గూటికి చేరిపోయారు. ఏపీలో పెద్దగా ఊపులేని కమలం పార్టీని ముందుకు నడిపించే బాధ్యతలు ఆయనకు తలనొప్పిగా పరిణమించాయి.

ఆర్ఎస్ఎస్ భావజాలం లేకపోవడంతో అధిష్టానంలోనే ఓ వర్గం కన్నాకు వ్యతిరేకంగా చక్రం తిప్పింది. ఆయనతో అంటీముట్టనట్టు వ్యవహరించింది. ఇక, రాష్ట్రంలోనూ కొందరు నాయకులు కన్నా లక్ష్మీనారాయణకు ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారు. ఫలితంగా కన్నా బీజేపీని ఎంతగా అభివృద్ధి చేయాలని లక్ష్యాలు పెట్టుకున్నా.. అవి ఏమాత్రమూ ఫలించలేదు. దీంతో పార్టీ పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది.

2019 ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ సారథ్యంలోనే బీజేపీ ఏపీలో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో నోటాకు బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు రావడాన్ని బట్టి చూస్తే ఏపీ ప్రజలు బీజేపీపై ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థమవుతోంది. ఇక ఆ ఎన్నికల్లో ఆయన స్వయంగా నరసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి అధిష్టానం అంచనాలను కూడా కన్నా లక్ష్మీనారాయణ చేరుకోలేక పోయారు. తాను కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే అయినప్పటికీ.. ఆ వర్గాన్ని బీజేపీకి చేరువ చేయలేక పోయారు. ఫలితంగా కేవలం రెండేళ్లకే ఆయనను పక్కన పెట్టారు. ఇక, ఇప్పుడు బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఒకవేళ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినా..ఆయన తన సొంత ఇమేజ్‌తోనే ప్రజలకు చేరువ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే.. అమరావతి విషయంలో కన్నా లక్ష్మీనారాయణ వ్యూహానికి, బీజేపీ అధిష్టానం ఆలోచనకు పొసగలేదు. ఫలితంగా గుంటూరులో ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వచ్చేందుకు కన్నా లక్ష్మీనారాయణకు ఇబ్బందికర వాతావరణం ఎదురవుతోంది.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *