గుజరాత్‌లో మొదలయిన చిచ్చు దావానలమై భారతావనిని కబళిస్తోందా?

గత కొద్ది రోజులుగా డయాన్ బున్షా (Dionne Bunsha) రాసిన Scarred: Experiments with violence in Gujarat నన్ను నిలువునా కంపింపజేస్తూవుంది.  2002లో గుజరాత్‌లో జరిగింది కేవలం దేశంలో అప్పుడప్పుడూ, అక్కడక్కడా జరుగుతుండిన మత కల్లోలాల వంటిదే అనుకున్నా ఇదివరకు. మీడియా కూడా అలానే చూపించింది. లోతుగా తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు, తెలుసుకోలేదు. పలితం 2014 ఎన్నికల్లో మోదీ పట్ల ఉదాసీనత. పైగా గుజరాత్ వెలిగిపోతున్నది అంటూ మీడియా వూదరగొట్టిన ఉత్తుత్తి అభివృద్ది.

అయిందేదో అయింది. గుజరాత్‌లో మొదలయిన ఈ చిచ్చు దావానలమై భారతావనిని కబళిస్తోంది. గుజరాత్‌లో హింసతో చేసిన ప్రయోగాలు దేశంలోనే అత్యున్నత పదవిని అప్పజెప్పాయి. ఇక ప్రతి ఎన్నికలూ ప్రజలకు కత్తిమీద సామే. ఈ పుస్తకము ప్రతి ఒక్కరూ చదవాల్సివుంది. ప్రతి కథనానికి ఆధారాలు ఇవ్వబడ్డాయి. ఈ పుస్తకం పెంగ్విన్ వారి ప్రచురణ. డయాన్ బున్షా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న జర్నలిస్టు.
పుస్తకం, గోద్రా రైలుదహనంతో మొదలు పెట్టి ఆనక జరిగిన మారణాకాండ, మారణకాండలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర, పోలీసుల పాత్ర, మీడియా పాత్ర, కేంద్ర ప్రభుత్వ పాత్రలతో పాటు ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషద్, బజరంగదళ్ మొదలగు హిందుత్వ సంస్థల ఎదుగుదల, ప్రణాళికలను వివరిస్తుంది. మీడియాలో చర్చించని ఎన్నో మారణకాండలను FIR నంబర్లతో సహా వివరిస్తుంది.

మార్చి 2002లో మొదలైన హింసాకాండను రకరకాల యాత్రల పేర్లతో డిసెంబరు 2002లో ఎన్నికలు జరిగే వరకూ ఎలా వేడిగా వుంచారో తేటతెల్లం చేసింది. ప్రతి ఎన్నికల వుపన్యాసంలో గోధ్రా ఎలా ప్రచారాంశం అయ్యిందో, మోదీ వివిధ సభల్లో మాట్లాడిన మాటల్ని వుటంకించింది. మచ్చుకు ఒకటి.. సర్వమూ పోగొట్టుకున్న బాధితులకు స్వచ్చంద సంస్థలు నడుపుతున్న శిబిరాలను, బాధితులను వుద్దేశించి గుజరాత్ గౌరవ యాత్రలో మోదీ పలికిన మాటలు..”ఏం చెయ్యమంటారు మమ్మల్ని? వాళ్ళకోసం శరణార్థి శిబిరాలు నడపాలా? పిల్లల్ని ఉత్పత్తి చేసే కేంద్రాలను నడపాలా? మేము అయిదుగురు, మాకు ఇరవై అయిదుగురు. కుటుంబ నియంత్రణకు మతం ఎక్కడ అడ్డొచ్చింది?… విపరీతస్థాయిలో జనాభాను పెంచే వాళ్లకు మనం ఒక పాఠం చెప్పాల్సిందే!”

హిందుత్వ మూకలూ, ప్రభుత్వ యంత్రాంగమూ ఎంత కలగలిసి పనిచేశాయనడానికి ఒక ఉదాహరణ: అహ్మదాబాద్, షాహీబాఘ్‌లోని పోలీస్ కమీషనర్ ఆఫీసు దగ్గర్లో వున్న 18శతాబ్దపు “వలి గుజరాతీ” అనే సూఫీ సన్యాసి దర్గాను మార్చి 1, 2002న కూల్చివేశారట హిందుత్వ మూకలు. వెంటనే అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆ శిధిలాల మీదుగా తారు రోడ్డు వేసేసి అక్కడ సూఫీ ఆలయం ఆనవాళ్ళు లేకుండా చేశారట.  గోధ్రా కేసులో డ్రకోనియన్ లా పోటా కింద 9 కేసులు బుక్ చేస్తే నిందితులంతా ముస్లిములే. కానీ గోధ్రానంతర మారణకాండలో పాల్గొన్న వందలమంది ఆరెస్సెస్, బజరంగదళ్, వీహెచ్‌పీ నాయకుల మీదా, కార్యకర్తల మీదా ఒక్కటంటే ఒక్కటీ పోటా కింద కేసు నమోదు అవలేదట.  చివరకు గుజరాత్‌లో పెద్ద సర్క్యులేషన్‌లో వున్న పత్రికలు మెజారిటీ హిందువుల ప్రాపకం కోసం అబద్దాలు వండివార్చి, రెచ్చగొట్టే కథనాలతో మొదటి పేజీలను ఎలా నింపడంలో పోటీపడ్డాయో కూడా వివరించింది.
ఈ పుస్తకం చదువుతుంటే, మోదీ అధికారంలోకి వచ్చాక అదే గుజరాత్ ప్రయోగాన్ని దేశమంతా ఎలా విస్తరిస్తున్నాడో కళ్ళకు కట్టినట్టు వుంది.
ఇంకా ఎవరికైనా భ్రమలు వుంటే ఒకసారి ఈ పుస్తకం చదవండి.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Fazal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *